అణు విద్యుత్తు అందని ద్రాక్షపండేనా?

నేడు వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు, వాతావరణ కాలుష్యం, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలు ప్రత్యమ్నాయ ఇంధన వనరుల వైపు మన దృష్టి సారించేటట్టు చేస్తున్నాయి. పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ)కి ప్రపంచంలోని అన్ని దేశాలు పెద్ద పీట వేస్తున్నాయి.

Three people standing, one is behind a podium and speaking into a microphone. An Australian flag is behind them.

(L-R) Shadow Treasurer Angus Taylor, Opposition Leader Peter Dutton, and Deputy Leader of the Opposition Sussan Ley unveil details of proposed nuclear energy plan during a press conference at the Commonwealth Parliamentary Offices in Sydney, Wednesday, June 19, 2024. (AAP Image/Bianca De Marchi) NO ARCHIVING Source: AAP / Bianca De Marchi

ఈ శక్తి ద్వారా గ్రీన్ హౌస్ ఉద్గారాలు కూడా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు, ప్రపంచ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

చౌకగా ప్రత్యమ్నాయ ఇంధన వనరులు ఏర్పర్చుకునే దిశగా, ప్రస్తుతం ఉన్న ఏడు బొగ్గు వనరుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని చేసే కేంద్రాలలో అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణం చేస్తామని పీటర్ డట్టన్ ప్రకటించారు. ఈ రియాక్టర్లను క్వీన్స్ ల్యాండ్ లోని టోరాంగ్, కాలిడే, న్యూసౌత్వేల్ లోని లిడెల్ మరియు మౌంట్ పైపర్ లలో, సౌత్ ఆస్ట్రేలియాలోని పోర్ట్ అగాష్టాలో, విక్టోరియాలోని లా యాంగ్, చివరగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని ముజాలలో నిర్మించాలని, తద్వారా ఆయా కేంద్రాలలో ఉన్న విద్యుత్తు సరఫరా మౌళిక సదుపాయాలను వినియోగించుకోవచ్చని ఆయన ప్రతిపాదించారు. వీటిలో మొదటి రియాక్టర్ను 2035 కల్లా పూర్తిచేయగలమనే విశ్వాసం ఆయన వ్యక్తపర్చారు. అయితే, వీటికయ్యే ఖర్చు ఎంత అన్న విషయాన్ని మాత్రం స్పష్టీకరించలేదు. ఈ రియాక్టర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు నేటి ప్రభుత్వం ప్రతిపాదించిన పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పోలిస్తే నామమాత్రమేనన్నారు.

పీటర్ డట్టన్ ప్రతిపాదన అర్థంలేనిదని, అణు రియాక్టర్ల నిర్మాణ వ్యయం తడిసిమోపుడవుతుందని, అంతేకాక, ప్రస్తుతం వాతావరణ కాలుష్యాన్ని నిలువరించవల్సి ఉందని, ఈ నిర్మాణాలు చేపడితే, కాలుష్య నివారణని మరో రెండు దశాబ్ధాలు వెనక్కి నెట్టుతారని పలువురు పర్యావరణ, ఇంధన వనరుల నిపుణులు అభిప్రాయపడ్డారు.

అణువిద్యుత్తు – పునరుత్పాదక విద్యుత్తు:

పారిస్ పర్యావరణ సమావేశంలో పారిశ్రామీకరణకు ముందున్న భూఉపరితల ఉష్ణోగ్రత కంటే 2100 నాటికి 2 డిగ్రీల సెంటిగ్రీడ్ కు పైగా ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని, వీలైతే ఈ పెరుగుదలను 1.5డిగ్రీల సెంటిగ్రేడ్ కు పరిమితం చేయాలని ప్రపంచ దేశాలు ఒప్పదం చేసుకున్నాయి. ఆ మేరకు 2050 నాటికి గ్రీన్ హౌస్ ఉద్గారాలను నెట్ జీరోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. కానీ గత సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం మే వరకు పరిశీలిస్తే, ఈ సగటు భూమి ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామీకరణకు ముందున్న దానికంటే 1.63 డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఐరోపా, ఉత్తర అమెరికాతోపాటు పలు దేశాలు అణువిద్యుత్తు సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా నెట్ జీరో సాధించవచ్చని భావిచటంతోపాటుగా ఆ దిశగా ప్రణాళికలు రూపోందించుకుంటున్నాయి.

పునరుత్పాదక ఇంధన వనురులైన వాయు, సౌర విద్యుత్తు కంటే అణు విద్యుత్తు ఎన్నో రెట్లు మెరుగు, మిగిలిన వాటితో పోలిస్తే చౌక. అలాగే, పర్యావరణ పరిరిక్షణను దృష్టిలోకి తీసుకుంటే, బొగ్గుతో ఒక యూనిట్ విద్యుత్తు తయారు చేస్తే 1050 గ్రాముల కార్బన్‌డై ఆక్సైడ్‌ విడుదల అవుతోంది. అదే అణు విద్యుత్తు అయితే 50 గ్రాములే విడుదల అవుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతుండగా, అణు ధార్మిక పదార్థాలు లీక్ అయితే పర్యావసానం భయంకరంగా ఉంటుందని, పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో కేవలం 10 శాతం మాత్రమే అణుశక్తి ద్వారా ఉత్పత్తి అవుతోంది. కాగా, 35 శాతం బొగ్గు ద్వారా, 23.6 శాతం గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతోందని ప్రపంచ అణు సంస్థ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.

ఇదిఇలావుండగా, ఫ్రాన్స్ దేశం దాదాపు 70 శాతం తమ విద్యుత్తు అవసరాలను అణువిద్యుత్తు ద్వారా తీర్చుకుంటోంది. ఈ ఉత్పత్తిని మరింత పెంచాలని ఆ దేశం ప్రణాళికలను రూపోందించుకుంటోంది. కాగా, ఉక్రేయిన్, స్లోవేకియా, బెల్జియం, హంగేరీ దేశాలు సగంపైగా విద్యుత్తును అణుశక్తి ద్వారా పొందుతున్నాయి. కెనడా ఇప్పటికే 19 అణు రియాక్టర్లు ద్వారా 13.6 శాతం విద్యుత్తు ఉత్పత్తిని అణుశక్తి ద్వారా చేసుకుంటున్నాయి. అలాగే మెక్సికో 4.5 శాతం, అమెరికా 18.2 శాతం, ఫిన్ల్యాండ్ 35శాతం, స్పెయిన్ 20.3 శాతం, స్వీడన్ 29.4 శాతం, యునైటెడ్ కింగ్డమ్ 14.2 శాతం అణు విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాయి.

ప్రపంచంలోని యురేనియం వనరుల్లో 28శాతం వనరులు కలిగి ఉన్న ఆస్ట్రేలియా మాత్రం తమ విద్యుత్తు అవసరాలకు పూర్తిగా బొగ్గుపైన ఆధారపడుతోంది. దాదాపు 60 శాతం విద్యుత్తు ఉత్పత్తి బొగ్గు ద్వారా జరుగుతుంది. అణుశక్తి ద్వారా మాత్రం ఎటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేయట్లేదు.

అయితే, వాయు, సౌర శక్తి ద్వారా చేసే విద్యుత్తు ఉత్పత్తి కంటే అణు రియాక్టర్ల ద్వారా చేసే విద్యుత్తి ఉత్పత్తి వ్యయం దాదాపు రెండింతలుంటుందని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (సిస్రో) అంటోంది. సిస్రో విడుదల చేసిన జెన్కాస్ట్ నివేదిక ప్రకారం వెయ్యి మెగావాట్ల అణు విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలంటే కనీసం 8.6బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అణు విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించి, వినియోగంలోకి తేవాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుందని ఈ నివేదిక తెలిపింది. కానీ ఇందుకు విరుద్ధంగా షాడో ఇంధన శాఖామంత్రి టెడ్ ఓ బ్రెయిన్ మాత్రం పీటర్ డట్టన్ ప్రతిపాదించిన అణు విద్యుత్తు కేంద్రాలను 10 సంవత్సరాలలో పూర్తి చేసి ఉత్పత్తిని కూడా మొదలుపెట్టవచ్చని వాదిస్తున్నారు.

ఆల్బనీసీ లేబర్ ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్తు వనరులను ప్రోత్సహిస్తుండగా, కూటమి పక్షము అణు విద్యుత్తును సమర్థిస్తోంది. వీటిలో ఏ పద్దతి మంచింది అంటే, రెండింటిలోనూ సాధకబాధకాలు లేకపోలేవు.

A coal powered plant with smoke coming out.
AGL has committed to closing the Loy Yang A power station in 2035. Source: AAP / Julian Smith
ముందుగా, అణువిద్యుత్తును ఎప్పుడంటే, అప్పుడు ఉత్పత్తి చేసుకుని పంపిణీ చేసుకోవచ్చు. ఈ అవకాశం సౌర, వాయు విద్యుత్తులకు లేదు. అలాగే, అణు రియాక్టర్ ను ఏర్పాటు చేయాలంటే ఎక్కువ స్థలం అవసరం లేదు. ఉదాహరణకు, ఒక గిగావాట్ అణువిద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మూడు చదరపు కిలోమీటర్ల స్థలం చాలు. అదే, ఒక చదరపు కిలోమీటర్ స్థలంలో కేవలం 50మెగావాట్ల సౌర విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేయగలం. అంటే ఒక గిగావాట్ అణు విద్యత్తు ప్లాంట్ సాలీనా ఉత్పత్తి చేసే విద్యుత్తును సౌర శక్తి ద్వారా ఉత్పత్తి చేయాలంటే 60 చదరపు కిలోమీటర్ల స్థలం కావల్సి ఉంటుంది. అదే గాలిమరల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే సౌర శక్తికి కావల్సిన స్థలం కంటే పందింతలు ఎక్కువ కావాలి. ఉత్పత్తి కేంద్రాలలో జరిగే ప్రమాదాలతో పోలిస్తే కూడా అణు రియాక్టర్లు అంత ప్రమాదరకమైనవి కావు.

అణువిద్యుత్తుకు అడ్డంకులు:

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు, మన దేశంలో అణు విద్యుత్తు ఉత్పాదనకు ఉన్న పెద్ద అడ్డంకి, చట్టాలు. జి20 దేశాలలో కేవలం ఆస్ట్రేలియా దేశం మాత్రమే అణు విద్యుత్తు ఉత్పత్తిని చట్టబద్ధంగా నిషేదించింది. హోవర్డ్ ప్రభుత్వం 1998లో అణు విద్యుత్తు నిషేద చట్టాన్ని చేసింది. అంటే ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ చేసిన ప్రతిపాదన గురించి ఆలోచించాలన్నా, కార్యరూపం దాల్చాలన్నా ముందుగా, చట్టాన్ని సవరించి, నిషేధాన్ని ఎత్తివేయాల్సి ఉంటుంది. కొన్ని ఐరోపా దేశాలలో, కెనడా, అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే అణు విద్యుత్తు రియాక్టర్లు ఉండటం వల్ల ఆయా దేశాలలో అణు విద్యుత్తుకు కావల్సిన ప్రత్యమ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేసుకోగలుగుతున్నాయి. కానీ ఆస్ట్రేలియాలో అలాకాదు. ముందుగా, పర్యావరణ, సురక్షిత, అణుధార్మిక వ్యర్థాలను నాశనం చేయడానికి కావల్సిన నియమ, నిబంధనలతోకూడిన కొత్త చట్టాలను చేయాలి లేదా ఉన్నవాటిని సవరించాలి. తదనంతరం అనువైన స్థలాన్ని ఎంచుకోని, అణు ప్లాంటు నిర్మాణంతోపాటు, తర్వాత విద్యుత్తు పంపిణీకి అవసరమైన కట్టడాలను కూడా నిర్మించాలంటే ఖర్చు తడసి మోపుడవుతుంది. ఈ పనులన్ని వచ్చే రెండు దశాబ్ధాలలో పూర్తి చేసి 2050 నాటికి జీరో నెట్ సాధించాలంటే సాధ్యమయ్యే పనికాదన్నిది అనేకమంది నిపుణుల అభిప్రాయం.

వాదప్రతివాదనలు ఎలా ఉన్నా, ‘‘అద్భుత, అభూత కల్పనలను వీక్షించాలంటే, నేను లార్డ్ ఆఫ్ రింగ్స్’’ చూస్తానని గ్రీన్స్ నాయకుడు ఆడమ్ బాండెట్ చెప్పినట్టు, పీటర్ డట్టన్ ప్రతిపాదనలు సాకారం కావలంటే వచ్చే పదేళ్లలో ఏదైనా అద్భుతం జరగాలి. 2040 నాటికి దేశంలోని బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లన్ని మూతబడనున్నాయి. ప్రస్తుతం దేశంలో నలభైశాతం విద్యుత్తు పునరుత్పాదక వనరుల ద్వారా లభ్యమవుతోంది. వీటి సామర్ధ్యాన్ని పెంచి, విద్యుత్తు ఉత్పాదన, సరఫరాను పెంచకపోయినా, ఇతర ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకపోయినా, దేశం ముందు, ముందు గడ్డు రోజులును ఎదుర్కొక తప్పదు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share
Published 8 July 2024 10:40am
By Sowmya Sri Rallabhandi
Presented by Sowmya Sri Rallabhandi
Source: SBS

Share this with family and friends